మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ మేడమ్ గారు రైతులను దొడ్డు రకాల వరి పంటకు బదులుగా బోనస్ తో కూడిన సన్న రకాల వరి పంటను సాగు చేయాలని సూచించారు. అలాగే, నిషేధిత పత్తి విత్తనాలను అమ్మడం, కొనుగోలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హాజీపూర్ మండలంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ మేడమ్ గారు మాట్లాడుతూ, లైసెన్స్ లేని విత్తనాలను నకిలీవిగా పరిగణిస్తారని, రైతులు అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. నిషేధిత గడ్డిమందు గ్లైపోసెట్ వినియోగాన్ని కూడా మానుకోవాలని తెలిపారు.
వరిలో దొడ్డు రకాలకు మార్కెటింగ్ సౌకర్యం ఉండదని, కాబట్టి BPT 5204, తెలంగాణ సోనా RNR 15048, KNM 1638 వంటి సన్న రకాలను సాగు చేయడం ద్వారా బోనస్ పొందవచ్చని ఆమె వివరించారు.
ACP మంచిర్యాల ప్రకాష్ గారు మాట్లాడుతూ, అనుమతి లేని పత్తి విత్తనాల కొనుగోలు, అమ్మకాలపై PD Act కింద కేసులు నమోదు చేస్తామని, విత్తన చట్టం కఠినంగా ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీలర్లు నిషేధిత విత్తనాలను ప్రోత్సహించరాదని, సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మండల టాస్క్ ఫోర్స్ కమిటీ తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, CI, SIలు, వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.












