సంగారెడ్డి, 2026-11-26
సంగారెడ్డి జిల్లాలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాల నిర్వహణ, పాఠశాల సమాచార ఆన్‌లైనింగ్ కోసం రూపొందించిన జిల్లా అధికారిక వెబ్ పోర్టల్‌ను అదనపు కలెక్టర్ సంగీత ప్రారంభించారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, పాఠశాలలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్ లైన్ అందుబాటులోకి తీసుకు రావడానికి రూపొందించిన జిల్లా అధికారిక వెబ్ పోర్టల్‌ను జిల్లా అదనపు కలెక్టర్ సంగీత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా రోవర్స్ కమిషనర్ సురభి చైతన్య, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కోశాధికారి సుందర్ రావు, కార్యదర్శి వి.మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంగీత మాట్లాడుతూ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా వెబ్ పోర్టల్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. సంబంధిత పాఠశాలలు పోర్టల్‌ను సద్వినియోగం చేసుకొని స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
జిల్లా కార్యదర్శి వి.మాధవరెడ్డి మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాల నిర్వహణకు అనుమతి పొందిన 174 పాఠశాలల వివరాలను ఇప్పటికే పోర్టల్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలో ప్రభుత్వం ద్వారా ఆయా పాఠశాలలకు స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫాంలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో, విద్యార్థుల యూనిఫాం కొలతలను పాఠశాలల లాగిన్ ద్వారా ఆన్లైన్లో సులభంగా నమోదు చేసి సమర్పించే సదుపాయాన్ని పోర్టల్‌లో కల్పించినట్లు ఆయన వివరించారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు ఈ ఆన్లైన్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల యూనిఫాం కొలతలను సకాలంలో నమోదు చేయాలని ఆయన కోరారు. వెబ్ పోర్టల్ వినియోగంలో ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఎదురైతే 9440069750 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

