మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గడ్ పూర్ గ్రామంలో ఇటీవల రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొని, రైతులను సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి డా. జె. సాయి ప్రసాద్, డా. పి. శివకుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగం ప్రాముఖ్యతను తెలియజేశారు.
వరి, మొక్కజొన్న అవశేషాలను కంపోస్టుగా మార్చడం, పచ్చి ఎరువుల వాడకం, పంటల మార్పిడి వంటి పద్ధతుల ద్వారా నేల సారాన్ని పెంచుకోవచ్చని, తద్వారా ఆదాయం మెరుగుపడుతుందని సూచించారు. పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి అంతర పంటల సాగును ప్రోత్సహించారు.
వరి సాగులో నీటి సంరక్షణకు ప్రత్యామ్నాయ తడుపు-ఎండబెట్టే విధానం (AWD), ఫార్మ్ పాండ్ల వినియోగం వంటి సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధతులపై రైతులకు వివరించారు. ఖరీఫ్ సీజన్‌కు అనుకూలమైన వరి రకాలపై వారి సందేహాలను నివృత్తి చేశారు.
సమగ్ర వ్యవసాయ విధానం (IFS) ద్వారా వనరుల సమర్థ వినియోగం, జీవనోపాధి భద్రత, స్థిరమైన వ్యవసాయాభివృద్ధి సాధించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.











