మడ్ ఫోర్ట్ అంబేడ్కర్ హట్స్ బస్తీలోని పేదల ఇళ్లను కూల్చివేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలను తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ మంగళవారం హైదరాబాద్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మడ్ ఫోర్ట్ అంబేడ్కర్ బస్తీలో 40 ఏళ్లుగా నివసిస్తున్న 650 పేదల కుటుంబాలను రోడ్డున పడేసే ప్రయత్నాలను ఖండించారు.
ప్రభుత్వం, కంటోన్మెంట్ అధికారులు బుల్డోజర్లతో బస్తీ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మడ్ ఫోర్ట్ అంబేడ్కర్ బస్తీ వాసులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, కవిత గారి అండతో టీఆర్ఎస్ నాయకులంతా బస్తీ వాసుల తరఫున పోరాటం చేస్తామని ఇస్మాయిల్ హామీ ఇచ్చారు.
స్థానిక ఎమ్మెల్యే గణేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బాధితులు వాపోతున్నారని ఆయన తెలిపారు. బస్తీ వాసుల వద్ద అన్ని గుర్తింపు కార్డులు ఉన్నాయని, అయినప్పటికీ వారిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.










