హైదరాబాద్, 2026-11-23
తెలంగాణ కార్మిక శాఖ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, కార్మిక సంక్షేమ చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. 28 రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులతో జరిగిన సమావేశంలో తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి ప్రత్యేకంగా అభినందించారని ఆయన వెల్లడించారు.
టాంకాం సంస్థ ద్వారా యువతకు జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, గిగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడం, కనీస వేతనాల అమలు, కార్మికులకు మెరుగైన వేతనాలు అందేలా తీసుకుంటున్న చర్యలు తెలంగాణ కార్మిక శాఖకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను కేంద్ర మంత్రి ప్రశంసించడంతో పాటు, ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ తరహా కార్యక్రమాలను పరిశీలించి అమలు చేయాలని సూచించినట్లు మంత్రి తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, కార్మిక సంక్షేమ రంగంలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.


