అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 31
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తల్లిపాల ప్రాముఖ్యత, ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, బస్తీధవకానాలు, మాతా శిశు సంరక్షణ జిల్లా ప్రభుత్వాసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలు, జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి కరపత్రాలను, పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని కేంద్రాలలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు తమ పరిధిలోని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, తల్లిపాల గురించి తెలియజేయాలని ఆదేశించారు. తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి అమృతం వంటివని, బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలని సూచించారు. బిడ్డకు తల్లిపాలు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని తెలిపారు.
తల్లిపాల వలన బిడ్డలకు వ్యాధి నిరోధక శక్తి పెరగడం, నీళ్ల విరోచనాలు, నిమోనియా, మధుమేహం, అలర్జీలు రాకుండా కాపాడటం, తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరగడం, జ్ఞాపకశక్తి, చురుకుదనం అధికంగా ఉండటం, కంటి చూపు మెరుగుపడటం, పిల్లల్లో భద్రతాభావం ఎక్కువగా ఉండటం వంటి అనేక లాభాలున్నాయని వివరించారు. కావున తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియజేయాలని కోరారు.
అదేవిధంగా, చల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం వలన గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయని, మధుమేహం, అధిక బరువు, మానసిక ఒత్తిడి రాకుండా కాపాడుతాయని తెలిపారు. ప్రసవానంతరం వెంటనే రక్తస్రావం తగ్గడానికి ఉపయోగపడుతుందని, దీనివల్ల తల్లులకు రక్తహీనత రాకుండా ఉంటుందని, గర్భాశయం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుందని, వెంటనే గర్భం రాకుండా తాత్కాలిక కుటుంబ నియంత్రణ విధానంగా కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు.
కాబట్టి తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి, బిడ్డకు ఎంతో లాభమని, ఈ విషయాన్ని గ్రామాలలో తల్లులకు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేయాలని ఆదేశించారు.
విజయవంతంగా తల్లిపాలు ఇవ్వడానికి 10 సూత్రాలు పాటించాలని, తల్లిపాలను పట్టించే విధంగా చర్యలు చేపట్టాలని, నిర్వహణ గురించి గర్భిణీ స్త్రీలకు తెలియజేయాలని సూచించారు. బిడ్డ పుట్టిన ఒక గంటలోపే పాలు ఇచ్చేందుకు సహాయం చేయాలని, బిడ్డ నుంచి తల్లిని వేరుగా ఉంచాల్సిన పరిస్థితి ఉన్నా తల్లిపాలు ఎలా ఇవ్వాలో తల్లికి చూపించాలని తెలిపారు. వైద్యపరంగా అవసరమైతే తప్ప బిడ్డకు తల్లిపాలు తప్ప ఏమీ తినిపించకూడదని, తాగించకూడదని, బిడ్డ కోరిన ప్రతిసారి తల్లిపాలు ఇచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు.












