అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసే లక్ష్యంతో తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఆదివారం ఘనంగా అవార్డులు ప్రదానం చేశారు.
తెలుగు సంస్కృతి, దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ పనిచేస్తున్నాయని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మాచవరం గౌరీ శంకర్ తెలిపారు.
ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారీ కత్రోజు, దైవజ్ఞ శర్మ, సూరేపల్లి విజయల హాజరయ్యారు. పలువురు ప్రముఖులు, అతిథులు అవార్డు గ్రహీతలను సత్కరించారు.
వివిధ రంగాలలో విశేష కృషి చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు పురస్కారాలు, శాలువాలు, జ్ఞాపికలు అందజేశారు. జర్నలిజం రంగంలో పబ్లిక్ టీవీ జర్నలిస్ట్ గరిగే సుమన్ కు జాతీయ పురస్కారం లభించింది.
ఈ సందర్భంగా అతిథులు, వక్తలు ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.








