హజీపూర్, 2026-11-23
మంచిర్యాల పురపాలక సంఘాన్ని కార్పొరేషన్ గా ఉన్నతీకరించిన ప్రభుత్వం, ఇందులో నస్పూర్ మునిసిపాలిటీ తో పాటు హాజీపూర్ మండలంలోని ఐదు పంచాయతీలను విలీనం చేసింది.
మంచిర్యాల పురపాలక సంఘాన్ని కార్పొరేషన్ గా ఉన్నతీకరించిన ప్రభుత్వం, ఇందులో నస్పూర్ మునిసిపాలిటీ తో పాటు హాజీపూర్ మండలంలోని ఐదు పంచాయతీలను విలీనం చేసింది. ఆ వెంటనే ఆయా పంచాయతీల రికార్డులు, సిబ్బంది, ఆస్తులను కార్పొరేషన్ లో కలిపి ఎన్నికల ప్రక్రియను ముగించారు. నూతనంగా సర్పంచులు పోయి కార్పొరేటర్లు వచ్చారు. అయినా ప్రజలకు అవసరమైన కనీస వసతుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిత్యం పారిశుద్ధ్య పనులు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కాలనీలు కంపు కొడుతున్నాయని, దోమలు పెరిగాయని ప్రజలు మండిపడుతున్నారు. వీధి దీపాల నిర్వహణ కొరవడిందని, మురుగు కాలువల్లో చెత్తను తొలగించడం లేదని వాపోతున్నారు. అనేక చోట్ల రహదారులు పగుళ్లు తేలాయి. మురుగు కాలువలు శిథిలమై నీరంతా రోడ్లపైకి చేరుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల పగటిపూట దీపాలు వెలుగుతుండగా, చాలా ప్రాంతాల్లో రాత్రివేళ చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఏ అధికారికి చెప్పినా సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
అధ్వానంగా మారిన రోడ్డు
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ కు చెందిన వాగోడ్డు పల్లెలో గతంలో ఈ ప్రాంతం హాజీపూర్ మండలం ముల్కల్లా పంచాయతీలో ఉండేది. దీనిని ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్ లో కలిపారు. ప్రత్యేకంగా డివిజన్ గా ఏర్పాటు చేసిన ముల్కలలో సమస్యలు తీరలేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరు. కార్పొరేషన్ లో విలీనమైన నాటి నుంచి సక్రమంగా పారిశుద్ధ్య పనులు చేయడం లేదు. తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. వీధి దీపాలు వెలగడం లేదు. గ్రామంలోని ప్రతి వీధి పగుళ్లతో ఉండటంతో ప్రజలు నడిచేందుకు ఇబ్బంది పడుతున్నారు.
ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం
కార్పొరేషన్ పరిధిలోని 15, 17, 18 వ డివిజన్ లకు చెందిన వేంపల్లి, గుడి పేట, నంనూర్, చందనాపూర్, నర్సింగాపూర్ లోని అనేక సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. కార్పొరేషన్ లో గ్రామాలను విలీనం చేస్తే అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. సరైన రహదారులు, వీధి దీపాలు, మురుగు కాలువలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు.
విలీనమైన పంచాయతీలు
విలీనమైన పంచాయతీలు: 05 (నర్సింగాపూర్, గుడి పేట, నం నూర్, ముల్కల్ల, వేంపల్లి) విలీనమైన వార్డులు: 50 కొత్తగా ఏర్పాటైన డివిజన్లు: 04.






