కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో బంధువులను సాగనంపేందుకు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులోకి ఎక్కిన 12 మంది పెద్దలు, ఒక చిన్నారి ఆటోమేటిక్ డోర్లు మూసుకోవడంతో కిందకు దిగలేకపోయారు. దీంతో వారంతా టికెట్లు లేకుండానే సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.
ఈ సంఘటన కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. బంధువులను వీడ్కోలు పలకడానికి రైలు ఎక్కిన 13 మంది ప్రయాణికులు, రైలు ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. వారు ఎంత ప్రయత్నించినా డోర్లు తెరచుకోకపోవడంతో, టికెట్లు లేకుండానే సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది. సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, ఇట్టావా రైల్వే స్టేషన్లో రైలు ఆగింది. అప్పటికే అప్రమత్తమైన రైల్వే అధికారులు, టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న ఈ 13 మందిని రైలు దింపి, వారిని విచారించారు. ఈ ప్రయాణానికి గాను, వారి నుంచి మొత్తం రూ.36,140 జరిమానా, ఛార్జీల రూపంలో వసూలు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో, రైల్వే అధికారులు ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశారు. రైళ్లలోకి ఎక్కే ముందు సరైన ప్రయాణ టికెట్ లేదా అవసరమైన అనుమతి తప్పనిసరిగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఇలాంటి అనూహ్య సంఘటనలు జరగకుండా ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.


