మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 25
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 22-ఏ సెక్షన్ కింద భూములను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ, ధన దాహంతో పేదల భూములను, ఇళ్లను ఈ జాబితాలో చేరుస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు మంచిర్యాల నస్పూర్ ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 22-ఏ సెక్షన్ కింద భూములను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ 22-ఏ సెక్షన్ కాంగ్రెస్ నాయకులు దోచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని ఎన్నికల సమయంలో దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు హామీలను గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని విజిత్ కుమార్ విమర్శించారు.
దివాకర్ రావు ఇచ్చిన పట్టాలపై కక్షసాధింపు
మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు అర్హులైన వారికి ఇచ్చిన ఇంటి పట్టాలను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం దుర్మార్గమని విజిత్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ధన దాహంతో పైసలు వసూలు చేయడమే లక్ష్యంగా, తన టార్గెట్ చేసే భూములను, ఇళ్లను 22-ఏ జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించారని, దీని ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయాలనే దుర్మార్గపు ఆలోచన ఆయనకు ఉందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో 1908 చట్టం ప్రకారం కాకుండా, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చట్టం ద్వారానే ఆస్తులను, భూములను నిషేధిత జాబితాలో చేర్చారని, ఎమ్మెల్యే ఇంటి నుంచి వచ్చిన జాబితా ప్రకారమే రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
నిషేధిత జాబితాలో వేలాది ఇళ్లు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జీవో 22-ఏ నిషేధిత జాబితా ప్రకారం మొత్తం 10,332 సర్వే నంబర్లు ఉన్నాయని విజిత్ కుమార్ వెల్లడించారు. ఇందులో మంచిర్యాల పరిధిలో 2,222, గర్మిళ్లలో 1,963, నస్పూర్ లో 3,138, తాళ్లపల్లిలో 803, సింగపూర్ లో 2,206 సర్వే నంబర్లు ఉన్నాయని, మొత్తం 10,332 ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చారని తెలిపారు. పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడానికే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ చర్యలకు పాల్పడుతున్నారని, నిషేధిత జాబితాలో పెట్టి భూములను అమ్ముకోవడానికి, కొనడానికి, లేదా వాటిపై లోన్ తీసుకోవడానికి కూడా వీలులేకుండా చేశారని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో పట్టాల పంపిణీ
గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీరాంపూర్ ఏరియాలో నడిపెల్లి దివాకర్ రావు గారు సింగరేణి స్థలాలలో ఉంటున్న దాదాపు 3 వేల మందికి పట్టాలు ఇచ్చారని, ప్రభుత్వం ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేయించారని విజిత్ కుమార్ గుర్తు చేశారు. దివాకర్ రావు గారు ఇచ్చిన పట్టాలను కూడా ప్రేమ్ సాగర్ రావు నిషేధిత జాబితాలో చేర్చడం కక్షసాధింపు చర్య అని అన్నారు. ఎమ్మెల్యే చెప్పినట్టుగా అధికారులు తప్పులకు పాల్పడితే, వారు ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు.











