నియోజకవర్గ పరిధిలో హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ లే అవుట్లపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు. భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు కేటాయించడంలో జాప్యం జరుగుతోందని, త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ లే అవుట్లపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. ఆరుట్ల, ఇంద్రకరణ్, ఫసల్వాది, కంది ప్రాంతాల్లో గతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుని రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చినా, ఇప్పటి వరకు ప్లాట్ల పొజిషన్ ఇవ్వలేదని పలువురు రైతులు ఎదురు చూస్తున్న విషయాన్ని జగ్గారెడ్డి, నిర్మల ప్రస్తావించారు. ఆయా ప్రాంతాల్లో లే అవుట్ల పరిస్థితి, పనుల ఆలస్యం, పూర్తయిన పనుల వివరాలపై జగ్గారెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరుట్ల లేఅవుట్ పరిధిలో 106 ఎకరాల 14 గుంటల్లో లేఅవుట్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, లబ్ధిదారుల జాబితా ఇంకా అందలేదని అధికారులు తెలిపారు. ఫసల్వాది ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియ సుమారు 60 శాతం పూర్తయిందని, కొంత ప్రాంతంలో రైతుల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని హెచ్ఎండీఏ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కంది గ్రామంలో 50 ఎకరాలకు హెచ్ఎండీఏ లేఅవుట్ ప్రతిపాదించగా, ప్రస్తుతం 46 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, లబ్ధిదారుల జాబితా ఇంకా పంపలేదని అధికారులు తెలిపారు. కంది లేఅవుట్ పనులను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, కంది, ఫసల్వాది లే అవుట్లను కూడా త్వరితగతిన సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడించారు. కంది, ఫసల్వాది, ఆరుట్ల లే అవుట్ లో నవంబర్ చివరికల్లా ప్లాట్లను కేటాయిస్తామని హెచ్ఎండీఏ అధికారులు సమావేశంలో తెలిపారు. లేఅవుట్లకు సంబంధించిన మిగిలిన పనులను పూర్తి చేసి, భూములు కోల్పోయిన లబ్ధిదారులకు సాధ్యమైనంత త్వరగా ప్లాట్లు కేటాయించాలని జగ్గారెడ్డి అధికారులను కోరారు. రైతులు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నందున, ప్రక్రియలో మరింత జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వచ్చే నవంబర్ చివరికల్లా హెచ్ఎండీఏ లేఅవుట్లలో భూములు కోల్పోయిన రైతులందరికీ ప్లాట్లు కేటాయించేలా పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు.












