సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆయన సిద్దాపూర్ రోడ్డును పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆయన సిద్దాపూర్ రోడ్డును పరిశీలించారు. ఆర్అండ్బీ, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ అధికారులతో రోడ్డు నిర్మాణం, వర్షపు నీటి పారుదల, కల్వర్టులు, డ్రైనేజీ పనులపై సమీక్ష నిర్వహించారు. మెయిన్ రోడ్డు నుంచి సిద్దాపూర్ కాలనీ చివరి వరకు పలుమార్లు పనులు చేపట్టినా రోడ్డు సమస్య పరిష్కారం కాకపోవడంపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 2004లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దాపూర్ రోడ్డు వేయించానని గుర్తు చేశారు. గత పదేళ్లలో ఈ రోడ్డు విషయంలో ఏం జరిగిందో తెలియదన్నారు. ఇకపై సిద్దాపూర్ రోడ్డు సమస్య పదే పదే చర్చకు రాకుండా పటిష్ఠంగా పనులు చేపట్టాలని సూచించారు. మెయిన్ రోడ్డు నుంచి సిద్దాపూర్ ఈద్గా వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర పూర్తిస్థాయిలో సీసీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని తెలిపారు. డిగ్రీ కళాశాల నుంచి మెయిన్ రోడ్డు జంక్షన్ వరకు సాంకేతికంగా సరైన లెవల్స్ తీసుకుని, వరద నీరు, డ్రైనేజీ నీరు సక్రమంగా వెళ్లేలా రోడ్డు నిర్మించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా డ్రైన్లు, అవసరమైన చోట్ల కల్వర్టులు ఏర్పాటు చేయాలని అన్నారు. కల్వర్టులు అవసరమైన ప్రాంతాలను జగ్గారెడ్డి, నిర్మల స్వయంగా పరిశీలించారు. రోడ్డు వెడల్పు, అందుబాటులో ఉన్న స్థలాన్ని టేపుతో కొలిచి మరీ పరిశీలించారు. కూల్చివేతలు లేకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 30 అడుగుల వెడల్పు ఉన్నచోట 30 అడుగులు, 40 అడుగులు ఉన్నచోట 40 అడుగులు, 60 అడుగులు అందుబాటులో ఉన్నచోట 60 అడుగుల మేర రోడ్డు నిర్మించాలని చెప్పారు. తనకు తెలియజేయకుండా సిద్దాపూర్ రోడ్డులో ఏ డబ్బానూ తొలగించవద్దని స్పష్టం చేశారు. చిరు వ్యాపారులు, పాన్‌షాపులు, పూల దుకాణాలు, మటన్, చికెన్ దుకాణాలకు ఇబ్బంది కలగకుండా పనులు జరగాలని అన్నారు. సిద్దాపూర్ కూడలిలో ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా జంక్షన్ అభివృద్ధి చేయాలని సూచించారు. మధ్యలో విగ్రహం ఏర్పాటుకు అనువుగా సర్కిల్ రూపకల్పన చేయాలని చెప్పారు. రోడ్డు పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సిద్దాపూర్ రోడ్డు పనులకు సంబంధించి రూ.2 కోట్ల నిధులు మిగిలి ఉన్నాయని, మున్సిపాలిటీలో టీఎఫ్ఐడీసీకి చెందిన మరో రూ.5 కోట్ల నిధులు కూడా అందుబాటులో ఉన్నాయని సమీక్షలో ప్రస్తావించారు. కలెక్టర్‌తో సమావేశం అనంతరం సంబంధిత శాఖల సమన్వయంతో పనులను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. సరైన లెవల్స్, డ్రైన్లు, కల్వర్టులతో కూడిన 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి లోగా అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణం, మండలంలోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు రోజూ ఒక ప్రాంతంలో పర్యటిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. త్వరలో ఊబ చెరువును పరిశీలిస్తానని అన్నారు.











