ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగించారనే కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు ఆధారాలు చూపాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అనవసర ఆందోళనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నవారిని గుర్తించడం కోసమే జాబితా సవరణ చేపడతారని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఓటు హక్కు కోల్పోయినట్లు చెబుతున్న పదివేల మందిని తీసుకొని ఢిల్లీకి వెళ్లాలని ముఖ్యమంత్రికి ఆయన సవాల్ విసిరారు. బూత్ స్థాయి అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు కూడా ఆధారాలు చూపాలని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారానే ఎన్నికల్లో గెలిచాయని గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలవలేకనే ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సింగూరు జలాలను హైదరాబాద్కు తరలించడంపై స్పందిస్తూ, సంగారెడ్డి ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను ప్రభుత్వం విస్మరించవద్దని ఆయన అన్నారు. సింగూరు జలాలను దిగువకు విడుదల చేయడంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, నాయకులు సంగప్ప, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.












