కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తోందని, ఇది 2028 ఎన్నికల్లో పార్టీకి 100 సీట్లు తెచ్చిపెడుతుందని ఎంపీ వంశీ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
మంచిర్యాలలో ఆంధ్రప్రభతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు, ఆస్తుల పంపకాలు పార్టీని బలహీనపరుస్తున్నాయని ఎంపీ వంశీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదని, పదేళ్ల అక్రమ సంపాదనతో పార్టీని నడుపుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారని వంశీ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు, బీజేపీ మతం, కులం, దేవుడి పేరుతో క్షుద్ర రాజకీయాలు చేస్తోందని, ప్రజల్లో ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతోందని, పథకాలను రద్దు చేస్తూ, పేదలను ముంచి కార్పొరేట్లకు మేలు చేస్తున్నారని ఎంపీ వంశీ విమర్శించారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ అధీనంలోనే ఉంటాయని ఆయన అన్నారు.
కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు కలిసి సమిష్టి గెలుపునకు కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు ఎంపీ వంశీ తెలిపారు.








