మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసిన అసత్య ప్రచారానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ దుర్మార్గమైన అసత్య ప్రచారం చేశారని, ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ కుట్రలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదని, ఇది మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్ ఇరిగేషన్లు, 250 మీటర్ల సొరంగంతో కూడిన భారీ నిర్మాణం అని వివరించారు. 300 స్తంభాలున్న ప్రాజెక్టులో రెండు స్తంభాలకు పాక్షికంగా పగుళ్లు వచ్చినంత మాత్రాన ప్రాజెక్టు కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేశారని, ప్రాజెక్టును కూల్చే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని రవీందర్ గౌడ్ విమర్శించారు. స్థానిక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.
ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








