మంచేరియల్, 11 July
మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, దీనిని అధికారులు వేగవంతం చేయాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు కోరారు. జిల్లా కలెక్టర్ BLOలకు తగిన సూచనలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు కోరారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం ఈ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు BLOలు 99 శాతం పంపిణీ చేసినట్లు నివేదిక ఇచ్చినా, అధికారులు దీనిని మరోసారి సరిచూసుకోవాలని సూచించారు. BLOలు పత్రాలు ఇచ్చిన తర్వాత వాటిని నింపి తిరిగి ఇచ్చే బాధ్యత ఓటర్లదే అయినప్పటికీ, 2002 ఓటరు లిస్టులో ఉన్నవారికి లేదా వారి కుటుంబ సభ్యుల ఓటును కనుగొనే ప్రక్రియపై అవగాహన లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని దివాకర్ రావు తెలిపారు.
అలాంటి వారికి BLOలు ప్రత్యేక చొరవ చూపించి, ఎన్యూమరేషన్ పత్రాలను నింపి, తిరిగి తీసుకోవాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను సేకరించినట్లే, తిరిగి తీసుకునే బాధ్యత కూడా BLOలదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి పత్రాలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ BLOలకు సూచనలు ఇవ్వాలని కోరారు.
08-07-2026 నాటికి దండేపల్లిలో 26.15 శాతం, లక్షెట్టిపేటలో 24.82 శాతం, హాజీపూర్ లో 22.91 శాతం, మంచిర్యాలలో 3.54 శాతం, నస్పూర్ లో 2.89 శాతం మాత్రమే ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి తీసుకున్నారని, మొత్తం నియోజకవర్గంలో 11.89 శాతం మాత్రమే పూర్తయిందని దివాకర్ రావు తెలిపారు. ఇదే తీరు కొనసాగితే గడువులోగా ప్రక్రియ పూర్తికాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కావున, ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనంగా BLOలను కేటాయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఓటర్లందరూ సహకరించి ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి, అవసరమైతే మరికొంతమంది BLOలను కేటాయించి, ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గడువులోగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పత్రాలను నింపి, ఓటు నమోదు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం, కలెక్టర్ దేనని నడిపెల్లి దివాకర్ రావు అన్నారు.












