చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు మద్దతుగా మంచిర్యాల జిల్లాలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 'నారీ శక్తి వందన్ ర్యాలీ' నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి మద్దతుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో CMR నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా గౌడ్ మాట్లాడుతూ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని, అనవసరమైన సాకులతో మహిళలను అగౌరవపరుస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిందని తెలిపారు.
మంచిర్యాల జిల్లా తరపున, మహిళా మోర్చా తరపున ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు గౌడ్ పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పార్టీలోని వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యురాలు అమరాజుల శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షులు జోగుల శ్రీదేవి, కార్పొరేటర్ బోట్ల అనిత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనగందుల కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు పట్టి వెంకట కృష్ణ, జిల్లా కార్యదర్శులు వైద్య శ్రీధర్, పచ్చ స్వప్న రాణి, నల్లుల సంగీత, స్వాతి, పాకాల శ్రీలత, కార్పొరేట్ అభ్యర్థులు కాదాసు అనూష, కోయడ పద్మ, జిట్టావేణి రేణుక, భైరం లక్ష్మీ, బొంగోని శిరీష, దాసరి పద్మ, తుమ్మెటి సరిత, కౌన్సిలర్ అభ్యర్థి తోట పద్మ, మేధరి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.











