దేశంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో ప్రతిపాదించిన డిలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలు అడ్డుకొని మహిళలకు, దక్షిణ రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేశాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆరోపించారు.
ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'జనాగ్రహ సభ'కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో, సభ పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1947 నుండి 1971 మధ్య జరిగిన డిలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణ రాష్ట్రాలకు కేవలం 5 సీట్లు మాత్రమే కేటాయించారని, ఈ అన్యాయం పునరావృతం కాకుండా ఉండేందుకు, జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో సీట్ల పెంపునకు మోదీ ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించిందని వెరబెల్లి తెలిపారు.
అయితే, కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసం ఈ బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఈ డిలిమిటేషన్ బిల్లు అమలులోకి వస్తే, సీట్ల పెంపుతో పాటు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి, వారిని రాజకీయంగా ఎదగడానికి మోదీ ప్రభుత్వం అవకాశం కల్పించిందని, కానీ కాంగ్రెస్, ఇతర పార్టీలు దీనిని అడ్డుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
మహిళలకు జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్లో 'జనాగ్రహ సభ' నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను మహిళలు, బడుగు బలహీనవర్గాలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.








