బ్రెజిల్లో జరిగిన అండర్-20 ఫుట్బాల్ మ్యాచ్లో ఫుట్బాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే మ్యాచ్లో 51 రెడ్ కార్డులు జారీ అయ్యాయి. ఉబెర్లాండియా, మమోరే జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది మధ్య ఘర్షణ చెలరేగడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
మ్యాచ్ రెండో అర్ధభాగంలో మమోరే జట్టు 3-1తో ఆధిక్యంలోకి వెళ్లిన సమయంలో ఆటగాళ్ల మధ్య వివాదం మొదలైంది. మమోరే ఆటగాడు డేవి గోల్ చేసిన అనంతరం ప్రత్యర్థి జట్టు బెంచ్ వైపు అభ్యంతరకరంగా సంజ్ఞలు చేయడంతో ఘర్షణ చెలరేగింది. ఇరు జట్ల ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది పరస్పరం దాడులకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఘటనలో మొత్తం 43 మంది ఆటగాళ్లు, ఎనిమిది మంది కోచింగ్ సిబ్బందికి రెడ్ కార్డులు జారీ అయ్యాయి. మరో ఇద్దరు క్లబ్ అధికారులపై కూడా చర్యలు తీసుకున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. గతంలో 2011లో అర్జెంటీనాలో జరిగిన మ్యాచ్లో 36 రెడ్ కార్డులు జారీ కావడం ప్రపంచ రికార్డుగా ఉండేది. తాజా ఘటనతో ఆ రికార్డు బద్దలైంది. సుమారు 40 నిమిషాల పాటు ఆటకు అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్ చివరకు భద్రతా కారణాలతో ముగిసింది. ఈ సంఘటన ఫుట్బాల్ క్రీడలో క్రమశిక్షణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.






