గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమైందని, రాబోయే రోజుల్లో ఐఎన్టీయూసీ విజయం ఖాయమని ఐఎన్టీయూసీ నాయకులు కాంపల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, నరేందర్ లు అన్నారు. మందమర్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
నాయకులు మాట్లాడుతూ, ఏఐటీయూసీ రెండు సంవత్సరాల ఆరు నెలల కాలంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ కూడా కార్మికుల కోసం ఏమీ చేయలేదని, అలాంటిది పోరాడి సాధించిన ఐఎన్టీయూసీని విమర్శించడం సరికాదని అన్నారు.
కార్మికుల సమస్యలు తెలంగాణ కనీస వేతనాల బోర్డ్ చైర్మన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలోనే పరిష్కారం అవుతాయని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఐఎన్టీయూసీ విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ఐఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తోందని, సంబంధిత అధికారులు, మంత్రులను కలిసి సమస్యలను వివరించామని తెలిపారు. వచ్చే నెల జూన్ లో 300కు పైగా డిపెండెంట్ ఉద్యోగాల అపాయింట్మెంట్ లెటర్లు లబ్ధిదారులకు చేరుతాయని వెల్లడించారు.
గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీ కార్మికులకు ఉపయోగపడే విధంగా పని చేయలేదని, కార్మికులు ఈ విషయాన్ని గమనించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పి. వెంకటస్వామి, ఆర్. శ్రీనివాస్, కె. ఒదెలు, డి. చంద్రశేఖర్, డి. బిక్షపతి, ఆంజనేయులు, బి. సదయ్య, కె. తిరుపతి, ఎస్. రాములు తదితరులు పాల్గొన్నారు.












