తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జైపూర్ మండలంలో మంగళవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అమరవీరులకు నివాళులర్పించడంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేయించారు.
జైపూర్ మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, శానిటేషన్ కిట్లను పంపిణీ చేశారు. అధికారులు మాట్లాడుతూ, విధులు నిర్వహించే సమయంలో కార్మికులు తమ ఆరోగ్య రక్షణ కోసం ఈ కిట్లను తప్పనిసరిగా వాడాలని సూచించారు.
మండలంలో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలను మేళతాళాల నడుమ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం, గ్రామ సర్పంచ్లు, వార్డు సభ్యులకు ఘన వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఎంపీడీవో జి.సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపు రావు, హౌసింగ్ ఏఈ కాంక్ష, స్థానిక నాయకులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












