మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ అనుమతులు లేకుండానే భారీ అక్రమ వెంచర్ అభివృద్ధి జరుగుతోంది. దీనిపై అధికారుల మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారం వల్ల కార్పొరేషన్ ఆదాయానికి భారీ గండి పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 326లో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ వెంచర్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. సాధారణంగా ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో లేఅవుట్ అభివృద్ధి చేయాలంటే కార్పొరేషన్ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలి. అలాగే, కొంత భూమిని కార్పొరేషన్ పేరిట మోర్టేజ్ చేయాలి. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
అయితే, ఈ అక్రమ వెంచర్ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్లాట్ల అమ్మకాలు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు నెలలుగా ఈ కార్యకలాపాలు జరుగుతున్నా, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న అనుమతులకే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఇంత పెద్ద అక్రమానికి అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
కొందరు అధికారులు అక్రమ వెంచర్ నిర్వాహకులతో కుమ్మక్కై ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ప్లాట్లు కొనుగోలు చేసే సామాన్యులు మోసపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అక్రమ వెంచర్‌ను తక్షణమే నిలిపివేసి, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి, సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో ఇలాంటి అక్రమాలకు మరింత ఆజ్యం పోసినట్లవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.












