మందమర్రిలో ఉద్యోగాలు కోల్పోయిన 213 మంది ఎస్ అండ్ పీసీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అండగా నిలిచారు. మంత్రి చొరవతో వారికి త్వరలో కొత్త టెండర్ల ద్వారా ఉద్యోగాలు లభించనున్నాయి.
కాంట్రాక్టర్ గడువు ముగియడంతో ఉద్యోగాలు కోల్పోయి, రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని సెక్యూరిటీ గార్డులు తెలిపారు. అధికారులను, ప్రజాప్రతినిధులను సంప్రదించినా ఫలితం లేదని, చివరికి మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినట్లు వారు పేర్కొన్నారు.
సచివాలయంలో మంత్రి తమ సమస్యను ఓపికగా విని, వెంటనే సింగరేణి సీ అండ్ సీఎండీ బుద్ధా ప్రకాష్‌తో మాట్లాడి, గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. సీ అండ్ ఎండీ కూడా సానుకూలంగా స్పందించినట్లు మంత్రికి తెలిపారు.
ఐదు రోజుల్లో నూతన టెండర్ల ద్వారా తమను విధుల్లోకి తీసుకునేలా యాజమాన్యానికి ఆదేశాలు అందినట్లు సమాచారం వచ్చిందని, ఇది తమ కుటుంబాలకు ఊరటనిచ్చిందని సెక్యూరిటీ గార్డులు తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి తమకు అండగా నిలిచిన గొప్ప నాయకుడని, మనసున్న మనిషి అని వారు కొనియాడారు.
తమకు ఉద్యోగాలు ఇప్పించడంలో మంత్రి చూపిన చొరవ అభినందనీయమని, తమ కుటుంబాలన్నీ ఇకపై మంత్రి వెంటే ఉంటామని, త్వరలోనే కృతజ్ఞతా కార్యక్రమాలు చేపడతామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.











