జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న 1x800 మెగావాట్ల ప్లాంట్ పనులను సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) ఎం. తిరుమల రావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ ఈడీ సిహెచ్. చిరంజీవి ఆయనకు స్వాగతం పలికారు.
డైరెక్టర్ తిరుమల రావు ప్లాంట్ ఆవరణలోని సేఫ్టీ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి, భద్రతా పరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్రాక్ హపర్ నిర్మాణ పనులను పరిశీలించారు.
కొత్త ప్లాంట్‌లో బొగ్గు అన్లోడింగ్ (కోల్ అన్లోడింగ్) కోసం 'రైల్ వ్యాగన్ టిప్లర్' అనే నూతన సాంకేతిక విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఈడీ చిరంజీవి ఈ సందర్భంగా డైరెక్టర్‌కు వివరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో డైరెక్టర్ మాట్లాడుతూ పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి నిర్ణీత సమయానికి మూడో యూనిట్ పనులను పూర్తి చేయాలని సూచించారు.
ప్లాంట్ పరిసరాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ఉద్యోగుల విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు పాల్గొన్నారు.












