తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం, యాదవ హక్కుల పోరాట సమితి ప్రతినిధులు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి, గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా, సంఘం నాయకులు మాజీ మంత్రికి గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సమస్యలను వివరించారు. నూతన జిల్లాల ఏర్పాటులో సహకార సంఘాల విభజన, ఎన్నికలు, వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన న్యాయం వంటి అంశాలపై చర్చించారు.
గొర్రెలు, మేకలు, బర్రెలకు మినీ పాల డైరీలకు 80% సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని, జీవాలకు నష్టపరిహారం, యువతకు ఉద్యోగ అవకాశాలు, వృద్ధులకు పింఛన్, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు ప్రాధాన్యత, కమ్యూనిటీ హాళ్లు, మానసిక వికలాంగుల కేంద్రాల ఏర్పాటు వంటి డిమాండ్లను కూడా వినతి పత్రంలో చేర్చారు.









