భూ సమస్యలు, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భూముల సమగ్ర రీసర్వే చేపట్టాలని నిర్ణయించింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశల వారీగా ప్రారంభిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబద్ మినహా 32 జిల్లాల నుంచి 70 గ్రామాల చొప్పున మొత్తం 2240 గ్రామాలను రీసర్వే కోసం ఎంపిక చేశారు. ఈ ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది వారి జీవనాధారమని, ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు భూదార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 1936 నాటి నిజాం కాలం నాటి సర్వే రికార్డులే ఆధారంగా ఉన్నాయని, కాలక్రమేణా భూముల విభజనలు, పట్టణీకరణ విస్తరించడం వంటి కారణాల వల్ల అసలు హద్దులపై స్పష్టత లోపిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికే ప్రభుత్వం సమగ్ర రీ-సర్వేను చేపడుతోంది.
భూ వివాదాల పరిష్కారంలో భాగంగా, నిజాం కాలం నుంచి నక్షాలు లేని 378 గ్రామాలను గుర్తించారు. వీటిలో 5 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి భూదార్ నంబర్లు కేటాయించారు. మిగిలిన 373 గ్రామాల్లో కూడా రోవర్స్ వంటి ఆధునిక సాంకేతికతతో సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పాత సర్వే పరికరాలకు స్వస్తి పలికి, డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే 411 రోవర్స్ కొనుగోలు చేయగా, మరో 400 కొనుగోలు చేయనున్నారు.
రీ-సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూకమతానికి ఖచ్చితమైన హద్దులు నిర్ణయించి, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయిస్తారు. ఆధార్ తరహాలో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపుగా భూదార్ కార్డులు జారీ చేయబడతాయి. డీజీపీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూ భారతి పోర్టల్‌లో నమోదు చేస్తారు. రీ-సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి 5,520 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి, లైసెన్సులు జారీ చేశారు. ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది సర్వేయర్లను నియమించారు.











