హైదరాబాద్లో యాదవ సామాజిక వర్గం సంప్రదాయ పండుగైన సదర్ సమ్మేళనం 24న ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో ఘనంగా జరిగింది. శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు, అలంకరించిన దున్నపోతులు, వాటి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దున్నపోతుల విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పండుగగా గుర్తించిన సదర్ వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. ఈ వేడుకలు హైదరాబాద్ సంస్కృతికి, యాదవుల సంప్రదాయాలకు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.


