ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జైపూర్ గ్రామ పంచాయతీలో చేపడుతున్న పారిశుధ్య పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) శ్రీపతి బాపు రావు బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిపై సిబ్బందిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
పెగడపల్లి శివారులో చెత్తతో నిండిన డ్రైనేజీలను ఎంపీఓ పరిశీలించి, వెంటనే వాటిని శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం డ్రైన్ ఎండ్ ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో వంద శాతం పన్ను వసూళ్లను పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఎంపీఓ శ్రీపతి బాపు రావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పెగడపల్లి, జైపూర్ పంచాయతీ కార్యదర్శులను ఈ విషయంలో ప్రత్యేకంగా అప్రమత్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ సర్పంచ్ కూన భాస్కర్, పెగడపల్లి సర్పంచ్ రామగిరి రాము, పంచాయతీ కార్యదర్శులు బి.ఉదయ్ కుమార్, శ్రీవాణి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.











