మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు పండించిన యాసంగి వడ్లు, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం ఎలాంటి తరుగు, షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ డిమాండ్ చేశారు. దండేపల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బస్తాకు మూడు కిలోల కటింగ్ చేస్తున్నారని, అలాగే పంట తరలింపునకు బస్తాకు రెండు రూపాయలు అడుగుతున్నారని ఆరోపించారు. ఇది అవినీతికి నిదర్శనమని ఆయన అన్నారు.
మొక్కజొన్న పంటకు ఎకరానికి 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, ఎలాంటి షరతు లేకుండా ఎకరానికి 40 క్వింటాళ్లు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలులో ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని తేడా చూపడం వల్ల రైతులు నష్టపోతున్నారని, అన్ని వడ్లను ఏ గ్రేడ్ కిందనే కొనాలని ఆయన కోరారు.
ప్రభుత్వం ప్రకటించిన బోనస్ క్వింటాల్ కి 500 రూపాయలు వెంటనే ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజుల్లా బతికితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన అన్నారు.
వెంటనే రైతుల పంటలను ఎలాంటి షరతులు, తరుగు లేకుండా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ తరపున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం దండేపల్లి ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.











