జైపూర్ మండలంలోని దుబ్బపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. సర్పంచ్ జాడి లక్ష్మీ వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గ్రామంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచే వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు దేవదంపతులకు తాళంబ్రాలు సమర్పించి ఆశీర్వాదాలు పొందారు.
గ్రామంలో తొలిసారిగా ఇంత వైభవంగా జరిగిన ఈ కల్యాణోత్సవం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, హనుమాన్ మాలధారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో పాల్గొనగా, భజనలు, కీర్తనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి.
కల్యాణోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు, భోజనం పంపిణీ చేశారు. గ్రామ పెద్దలు, యువకులు, స్వచ్ఛంద కార్యకర్తలు కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.
సర్పంచ్ జాడి లక్ష్మీ వెంకటేష్ మాట్లాడుతూ, గ్రామంలో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ఐక్యత, భక్తి భావాన్ని పెంపొందిస్తామని తెలిపారు.












