తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలలో భాగంగా, వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది. మే 7వ తేదీన మండల స్థాయి రైతు వేదికల్లో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
రాష్ట్ర ఎనర్జీ శాఖ ఆధ్వర్యంలో, 'వ్యవసాయ క్షేత్రాలు – సౌర విద్యుత్ కేంద్రాలు (PM-KUSUM)' అనే అంశంపై నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో, సౌర విద్యుత్ ఆధారిత సాగు విధానాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ తెలిపారు. ఈ కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా, సౌరశక్తి ప్రాముఖ్యత, పునరుత్పాదక ఇంధనాల ఆవశ్యకతపై నిపుణుల ప్రసంగాలు ఉంటాయి. PM-KUSUM పథకం యొక్క Component-A మరియు Component-C ల గురించి వివరణాత్మకంగా తెలియజేస్తారు. ఇప్పటికే ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన రైతులు తమ అనుభవాలను, విజయ గాథలను పంచుకుంటారు. రైతులతో ప్రత్యక్ష చర్చలు, వారి సందేహాల నివృత్తికి కూడా అవకాశం కల్పించబడుతుంది.
సౌర పంపింగ్ సిస్టమ్స్‌పై సాంకేతిక మార్గదర్శకాలను నిపుణులు వివరిస్తారు. ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు హాజరై రైతులకు మార్గనిర్దేశం చేస్తారు. మండల స్థాయిలో AE/ADEలు, జిల్లా స్థాయిలో SEలు కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. టిజి రెడ్కో ద్వారా అవసరమైన పత్రాలు, ఆడియో-విజువల్ సమాచారం అందించబడుతుంది. రైతులకు సౌర విద్యుత్, PM-KUSUM పథకాలపై సమాచార పుస్తకాలు పంపిణీ చేయబడతాయి.










