జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులకు నాణ్యమైన మొక్కలు అందించేందుకు నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగులో నాణ్యమైన మొక్కలు, శాస్త్రీయ పద్ధతుల్లో పెంపకం, సరైన నీటి యాజమాన్యం కీలకమని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం రైతులకు ఆయిల్ పామ్ మొక్కకు రూ.193 చొప్పున రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం మండలం పోటిపల్లి గ్రామంలో గోద్రెజ్ అగ్రోవేట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయిల్ పామ్ నర్సరీని జిల్లా కలెక్టర్ సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకం, నిర్వహణ, నీటి యాజమాన్యం, మొక్కల నాణ్యత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నర్సరీలలో మొక్కల పెంపకానికి నిర్దేశించిన ప్రమాణాలు, నీటి యాజమాన్యం, ఎరువుల వినియోగం, మొక్కల ఆరోగ్యం తదితర అంశాలను ఉద్యాన శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. రైతులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన మొక్కలు మాత్రమే అందేలా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి.సోమేశ్వర్ రావు, ఉద్యాన అధికారులు పండారి, కె.సునీత, అదనపు వ్యవసాయ అధికారి వైద్యనాథ్, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, శైలజ, కేవీకే శాస్త్రవేత్త, గోద్రెజ్ అగ్రోవేట్ నర్సరీ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఏజీఎం ఈశ్వర్ రెడ్డి, హెచ్ఈఓ సతీష్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.








