హాజీపూర్ మండలం ధర్మారం గ్రామంలో సాగునీటి సమస్య తీవ్రంగా మారింది. బుగ్గ గట్టు శివారులో సుమారు 50 ఎకరాల్లో సాగుచేసిన వరి పంటకు నీరు అందక ఎండిపోతోంది. చివరి ఆయకట్టు భూములకు కాలువల ద్వారా నీరు చేరకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలువల్లో నీరు లేకపోవడంతో పంట చేతికి వచ్చే దశలో పొలాలు నెర్రెలుబారుతున్నాయి. ఈ పరిస్థితితో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే ఆశతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. సమీపంలోని బోరు బావుల మోటార్ల సహాయంతో పైపుల ద్వారా నీటిని కాలువల్లోకి మళ్ళించి, అక్కడి నుంచి తమ పొలాలకు తరలించుకుంటున్నారు. అయితే, ఈ తాత్కాలిక ఏర్పాట్లు ఎంతవరకు పంటను కాపాడతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.











