రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తనపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇందారం సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్ ఆరోపించారు. రామారావుపేట గ్రామ రైతుల ఆందోళన ఘటనపై ఆయన శనివారం స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో తన వీడియోను వక్రీకరించి, అసలు నిజాన్ని దాచిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ధాన్యం మిల్లర్లు 43 కిలోల తూకంతో ధాన్యం తీసుకోవాలని రైతులు కోరుతున్నారని, దీనిపై సీఐతో కలిసి చర్చలు జరిపి 41 కిలోలకే ఒప్పించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులకు వివరిస్తున్న సమయంలో జరిగిన సంభాషణలోని కొన్ని పదాలను మాత్రమే చూపిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిల్లర్లు చేసిన బకాయిలు, అవినీతి కారణంగానే కొన్ని మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టాల్సి వచ్చిందని, దీనివల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఫయాజ్ వివరించారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
రైతులు అధైర్యపడవద్దని, విపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దని సర్పంచ్ ఫయాజ్ తన సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.











