టామ్‌కామ్ ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న నర్సులతో టూరిజం ప్లాజాలో ఒక ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, జర్మనీలో పనిచేయడం ఒక గొప్ప అవకాశంతో పాటు సవాలుతో కూడుకున్నదని, కొత్త భాష, వాతావరణం, విధానాలకు అలవాటు పడాల్సి ఉంటుందని నర్సులకు సూచించారు. కష్టపడి నేర్చుకుంటే విజయం సాధించవచ్చని తెలిపారు.
నర్సులు రోగులకు ఇచ్చే ధైర్యం, నమ్మకం సగం వ్యాధిని నయం చేస్తాయని, అందుకే నర్సింగ్ వృత్తి ఎంతో గొప్పదని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. టామ్‌కామ్ ద్వారా తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నామని, ఈ బ్యాచ్ జర్మనీలో మంచి ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
జర్మన్ భాషపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డాక్టర్లు సూచించిన మందులను రోగులకు సరిగ్గా అందించడంలో కమ్యూనికేషన్ కీలకం అని నర్సులకు సూచించారు. ఆధునిక టెక్నాలజీ, సోషల్ మీడియా, కమ్యూనికేషన్ నైపుణ్యాలను సమర్థంగా ఉపయోగించుకుంటే గొప్ప విజయాలు సాధించవచ్చని వివరించారు. ప్రతిరోజూ కనీసం గంట సమయం కేటాయించి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, జర్మన్ పుస్తకాలు చదివే స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు.
తన వ్యాపార అనుభవాలను కూడా నర్సులతో పంచుకున్నారు. కేవలం ఐదు లక్షల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి, మద్రాస్‌లో బ్యాంక్ లోన్ కోసం వెళ్ళినప్పుడు భాష తెలియక పడిన ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. అప్పుడు భాష ప్రాధాన్యత తనకు బాగా అర్థమైందని తెలిపారు. టామ్‌కామ్ కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించిందని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి రాష్ట్రంలో మరిన్ని నర్సింగ్ కళాశాలలు, సీట్ల పెంపుపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. జర్మనీలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న నర్సులతో ఆన్లైన్ ద్వారా మాట్లాడి వారి అనుభవాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.






