కర్ణమామిడిలో జరిగిన 'పంట అవశేషాలకు నిప్పు – పర్యావరణానికి ముప్పు' కార్యక్రమంలో ADA మంచిర్యాల మామిడి క్రిష్ణ గారు మాట్లాడుతూ, పంట అవశేషాలను కాల్చివేయడం వలన భూసారం తగ్గిపోవడంతో పాటు, వాయు కాలుష్యం పెరిగి, అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని హెచ్చరించారు.
రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, కంబైన్ హార్వెస్టర్ల వినియోగం వల్ల మిగిలిపోతున్న పంట అవశేషాలను రైతులు కాల్చివేయడం వలన నేల భౌతిక స్థితికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ADA మామిడి క్రిష్ణ గారు వివరించారు. ఈ దహనం వలన నేల కోల్పోయే పోషకాల విలువను ఆయన గణాంకాలతో సహా తెలియజేశారు.
పంట అవశేషాల దహనం వలన నేలపై సూక్ష్మజీవులు నశించి, భూసారం దెబ్బతినడమే కాకుండా, హానికర వాయువులు విడుదలై వాయు కాలుష్యం పెరుగుతుందని, భూమి ఉష్ణోగ్రత పెరిగి, పంటల ఉత్పాదకత తగ్గిపోతుందని, పశుగ్రాసం కొరత ఏర్పడుతుందని, రైతు మిత్రులైన జీవులు నశించిపోతాయని ఆయన పేర్కొన్నారు.
పంట అవశేషాలను కాల్చివేయడానికి బదులుగా, వాటిని మట్టిలో కలిపి సేంద్రియ ఎరువులుగా ఉపయోగించుకోవాలని, హ్యాపీ సీడర్ లేదా రోటావేటర్ ద్వారా భూమిలో కలిపి, త్వరగా కుళ్ళేలా చేయాలని సూచించారు. వీటిని బయోమాస్, బయోగ్యాస్, కంపోస్ట్ తయారీలోనూ వినియోగించవచ్చని తెలిపారు.











