దేశవ్యాప్తంగా పెట్రోల్లో ఇథనాల్ కలిపే పరిమాణంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ కీలక వివరాలు వెల్లడించింది. దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సేకరించిన 893 ఈ20 పెట్రోల్ నమూనాలను పరీక్షించగా, అన్నీ నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపింది. ఈ నమూనాల్లో ఇథనాల్ శాతం 19 నుంచి 21 మధ్య ఉన్నట్లు పేర్కొంది.
కర్ణాటకలో పరీక్షించిన 56 నమూనాల్లోనూ ఇథనాల్ శాతం 19 నుంచి 20 మధ్యే నమోదైందని, సగటున 19.30 శాతంగా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది.
కర్ణాటకలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ శాతం 26 నుంచి 31 వరకు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ఖండించాయి. ఆ పరీక్షల్లో అనుసరించిన నమూనాల సేకరణ, పరీక్షా విధానాలపై సందేహాలు వ్యక్తం చేశాయి.
సంబంధిత ప్రయోగశాల నివేదికలు, నమూనాల వివరాలు అందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని చమురు సంస్థలు కోరాయి. ఇరు పక్షాల సమక్షంలో నిర్దేశిత విధానాల ప్రకారం సంయుక్తంగా నమూనాలు సేకరించి, స్వతంత్ర పరీక్షలు నిర్వహించాలని చమురు సంస్థలు ప్రతిపాదించాయి.




