మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా మాఫియా పంజా విసురుతోందని, గోదావరి నది పరివాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పరిసర గ్రామాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ దందాపై మండల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, కిష్టాపూర్ గ్రామంలో గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగి, రాత్రి సమయాల్లో ట్రాక్టర్ల ద్వారా పరిసర గ్రామాలకు తరలిస్తున్నారు. ఆన్లైన్ అనుమతుల విధానం అమల్లో ఉన్నప్పటికీ, దాన్ని పూర్తిగా విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
గురువారం రాత్రి కిష్టాపూర్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను శెట్టిపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిరుపతి రాజు అడ్డుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో, డ్రైవర్లు ఇసుకను రోడ్డుపైనే పారబోసి వాహనాలతో పరారయ్యారు. పోలీసులు ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే కఠిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్రమార్కులు రెచ్చిపోవడమే కాకుండా, చిత్తశుద్ధితో పనిచేస్తున్న మంత్రికి కూడా చెడ్డపేరు వస్తోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంపై మండల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ దందాను అరికట్టాలని వారు కోరుతున్నారు. కిష్టాపూర్ శివారులో రాత్రిపూట నిఘా పెంచాలని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహన యజమానులపై కఠిన కేసులు నమోదు చేయాలని, ఇసుక రీచ్ల వద్ద పారదర్శకతను పెంచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.










