మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్తను బీమా డబ్బుల కోసం భార్య, ఆమె ప్రియుడు, మరికొంత మంది కలిసి హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
మంచిర్యాల రూరల్ పరిధిలోని హాజీపూర్ మండలం గుడిపేట్ గ్రామంలో ఈనెల 22న సాయిని కుమార్ (40) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు, భార్య సాయిని భారతి, ఆమె ప్రియుడు లగిశెట్టి సురేందర్, రామ్ మల్లేష్, శ్రీరాం కుమారు కలిసి ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు.
భార్య భారతి, ప్రియుడు సురేందర్ ల అక్రమ సంబంధం కొనసాగడానికి, భర్త కుమార్ అడ్డు వస్తుండటంతో, అతన్ని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. కుమార్ పేరు మీద దాదాపు 60 లక్షల రూపాయల బీమా పాలసీలు చేయించి, హత్య తర్వాత ఆ డబ్బులు దక్కించుకోవాలని యోచించారు.
ఈనెల 22న కుమార్ ను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, మద్యం తాగించి, ఇనుప సుత్తితో తలపై మోది హత్య చేశారు. అనంతరం, మృతదేహాన్ని రోడ్డుపై పడేసి, బైక్ తో ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పరారయ్యారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తులో అసలు నిజాన్ని వెలికితీశారు.
హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.








