రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ వీఓఏలు చేపట్టిన సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని పార్టీ ఆరోపించింది.
నెలరోజులుగా సమ్మె చేస్తున్న వీఓఏల సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం సిగ్గుచేటని బహుజన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం మందమర్రి మండలంలో వీఓఏలు చేస్తున్న సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, వీఓఏలకు కనీస వేతనం రూ. 20,000 ఇవ్వాలని, SERP ఉద్యోగులుగా గుర్తించి HR పాలసీ వర్తింపజేయాలని, అర్హులైన వీఓఏలకు CC పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే, వీఓఏలకు రూ. 20 లక్షల వరకు సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ట్యాప్ సౌకర్యం అందించాలని, 58 జీవోను సవరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, ఉపాధ్యక్షులు ఎండి మతెన్ ఖాన్, మందమర్రి పట్టణ నాయకులు ఐలెని రాజు, మండల వీఓఏల అధ్యక్షురాలు వనజ, కార్యదర్శి వెంకటేష్, ప్రచార కార్యదర్శి కామెర తుకారం, ఇతర వీఓఏలు పాల్గొన్నారు.










