సంగారెడ్డి పట్టణంలోని సర్ సి.వి. రామన్ సైన్స్ జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సందర్శించారు. మ్యూజియంలోని శాస్త్రీయ నమూనాలు, గ్యాలరీలను పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు.
సంగారెడ్డి పట్టణంలోని పాత డీఆర్డీఏ ప్రాంగణంలో ఉన్న సర్ సి.వి. రామన్ సైన్స్ జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ శాస్త్రీయ నమూనాలు, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, గణితం, అంతరిక్ష ఫొటో గ్యాలరీ, శాటిలైట్ నమూనాలు, డైనోసార్, బొటానికల్ గార్డెన్‌ను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. మీటింగ్ హాల్లో ప్రదర్శించిన గణిత ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. జిల్లా సైన్స్ మ్యూజియంలో త్వరలో రోబోటిక్స్ కు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేయాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న సంచార విజ్ఞాన ప్రయోగశాల, సోహం రోబోటిక్స్, జన్య ఫౌండేషన్ ల్యాబ్ కార్యక్రమాల వివరాలను అధికారులు ఆమెకు వివరించారు. సంచార విజ్ఞాన ప్రయోగశాల సేవలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ప్రయోగశాలలను సమర్థంగా వినియోగించుకోవాలని చైతన్య రెడ్డి పేర్కొన్నారు. పరిసరాల్లో లభించే వస్తువులను ఉపయోగించి, విజ్ఞాన శాస్త్రాన్ని నిజ జీవిత అనుభవాలకు అనుసంధానం చేస్తూ బోధన సాగించాలని సూచించారు. మ్యూజియం సందర్శనకు ముందస్తు బుకింగ్ తప్పనిసరి. సందర్శించాలనుకునే పాఠశాలలు జిల్లా సైన్స్ అధికారి పి. సిద్ధారెడ్డి (ఫోన్: 63022 90235)ను సంప్రదించి ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో టాస్ కోఆర్డినేటర్ వెంకటస్వామి, జిల్లా సైన్స్ అధికారి పి. సిద్ధారెడ్డి, జీసీడీఓ సునీత కన్నా, ఎన్జీసీ మాధవరెడ్డి పాల్గొన్నారు.












