సంగారెడ్డి మండలం ఫసల్ వాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు కడియాల చంద్రశేఖర్‌కు ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ విద్యా రత్న జాతీయ అవార్డు2026 లభించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని నీతి ఆయోగ్ గుర్తింపు పొందిన మనం ఫౌండేషన్ ఈ అవార్డును అందజేసింది.
శనివారం సాయంత్రం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ జి.సుబ్బారావు, రచయిత యలమంచిలి వెంకట్ రమణ, మనం ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తి చేతుల మీదుగా చంద్రశేఖర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గత 25 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ, విద్యారంగంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పురస్కారంతో కలిపి చంద్రశేఖర్ ఇప్పటి వరకు 15కు పైగా అవార్డులు, అనేక ప్రశంసా పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వహీద్ పాషా, మండల విద్యాధికారి విద్యాసాగర్, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు చంద్రశేఖర్‌ను అభినందించారు.






