కండి, 2026-08-27
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను మెరుగు పరచడమే లక్ష్యంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.రోహిణి సూచించారు. గురువారం కంది మండలం చేర్యాల ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించి, ఎఫ్ఎల్ఎన్ అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను మెరుగు పరచడమే లక్ష్యంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.రోహిణి సూచించారు. గురువారం కంది మండలం చేర్యాల ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించి, ఎఫ్ఎల్ఎన్ అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను వివిధ అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
అన్ని సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు, వారు సాధించిన అభ్యసనా ఫలితాలను తరగతి గదుల్లో ప్రదర్శించాలని సూచించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా వారు నేర్చుకుంటున్న అంశాలను తరగతి గదుల్లో ప్రదర్శించాలని తెలిపారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించిన ఆమె, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లల ఫొటోలతో హాజరు చార్టులను ఏర్పాటు చేయడం ద్వారా హాజరు శాతం పెరిగిన తీరును పరిశీలించారు.
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు రెమిడియల్ తరగతులు నిర్వహించాలని, అన్ని తరగతుల వర్క్‌బుక్‌లను ఎప్పటికప్పుడు సరి చేయాలని ఆదేశించారు. అన్ని రిజిస్టర్లు, రికార్డులు, పీటీఎం సమావేశాల వివరాలు, ఏజీఆర్, మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) తదితర రికార్డులను ఆమె పరిశీలించారు. విద్యార్థులను స్వయంగా పిలిచి చదివించడం, రాయించడం ద్వారా వారి అభ్యసనా స్థాయిని తెలుసుకున్నారు. ప్రతి తరగతి గదిలో టార్గెట్ సెట్టింగ్, వార్షిక ప్రణాళికలను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.
ప్రత్యేకంగా 2, 3వ తరగతుల విద్యార్థులపై ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ వహించాలని రోహిణి సూచించారు. అన్ని తరగతి గదుల్లో చక్కటి బోధనాభ్యసన సామగ్రి () ప్రదర్శనపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్వ ప్రాథమిక పాఠశాల పెయింటింగ్‌ను కూడా పరిశీలించారు.
అలాగే కాశీపూర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఖాన్ అకాడమీ, డిజిటల్ లెర్నింగ్ వంటి అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం సమర్థవంతంగా అమలయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ జోగప్ప, డీసీఈబీ సెక్రటరీ లింభాజీ, డీఎస్ఓ సిద్ధారెడ్డి, ఎస్ఓ మీరాబాయి, హెచ్ఎం రాఘవులు, ఆర్పీలు ఆనంద్, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.






