ప్రముఖ మలయాళ గాయని, టీవీ వ్యాఖ్యాత రిమి టోమీ త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్నారు. ముంబైకి చెందిన జిమ్ శిక్షకుడు, బాడీబిల్డర్ లిబిన్ మాథ్యూను ఆమె పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో నటి శ్వేతా మీనన్ గతంలో రిమి ఇన్స్టాగ్రామ్ పోస్టుపై చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
రిమి ప్రేమ వ్యవహారాన్ని శ్వేత ముందుగానే గుర్తించారంటూ అభిమానులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. గత సెప్టెంబర్‌లో రిమి టోమీ, లిబిన్ మాథ్యూతో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అప్పట్లో ట్రెండ్‌గా మారిన 1980ల నాటి పాతకాలపు దుస్తుల శైలిలో ఈ ఫొటోను రూపొందించారు. దానికి నా బెస్ట్ ట్రైనింగ్ పార్ట్నర్ అంటూ ప్రేమ సూచికను కూడా జోడించారు.
ఈ పోస్టుపై స్పందించిన శ్వేతా మీనన్.. నేను ఇందులో మరేదైనా అర్థం వెతుకుతున్నానా అంటూ సరదాగా కామెంట్ చేశారు. అప్పట్లో రిమి చిరునవ్వు, ప్రేమ సూచికలతో స్పందించారు. ఇప్పుడు రిమి తన ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించడంతో శ్వేత చేసిన పాత వ్యాఖ్యను అభిమానులు మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు.
వివాహ వివరాలు
లిబిన్ మాథ్యూతో తన పరిచయం మార్చిలో ప్రారంభమైందని రిమి తెలిపారు. తొలిసారి ఫోన్లో, ఆ తర్వాత ప్రత్యక్షంగా కలిశామని చెప్పారు. మొదటి పరిచయంతోనే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. న ముంబైలోని డోంబివ్లీలో చర్చిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం జరగనుంది.
తనకు లిబిన్తో ఉన్నప్పుడు ధైర్యం, ప్రశాంతత, సానుకూల భావన కలుగుతాయని రిమి పేర్కొన్నారు. తన రెండో వివాహ వార్తల నేపథ్యంలో మాజీ భర్త ఫోటోలను ఉపయోగించి వీడియోలు, వార్తలు ప్రచారం చేయవద్దని రిమి కోరారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, ఆయన ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.












