దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చేటప్పుడు కంటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.లలితా దేవి సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా కంటి చూపుకే ప్రమాదం కలిగించవచ్చని ఆమె హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లా ప్రజలకు డా.లలితా దేవి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ, దీపావళి అంటే వెలుగుల పండుగ అని, ఈ వెలుగులు మన జీవితాల్లో సంతోషాన్ని నింపాలని, అయితే కంటికి ఎటువంటి హాని కలిగించకూడదని ఆమె కోరారు. 1. పిల్లలు ఒంటరిగా క్రాకర్స్ కాల్చకూడదు. పెద్దవారు తప్పనిసరిగా పక్కనే ఉండాలి. 2. సీమ టపాకాయలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు వంటివి పిల్లల చేతికి ఇవ్వవద్దు. 3. క్రాకర్స్ కాల్చేటప్పుడు దూరంగా నిలబడి కాల్చాలి. వంగి చూడవద్దు. 4. వెలగని టపాకాయను మళ్లీ వెలిగించవద్దు. దానిపై నీళ్లు పోసి పక్కన పెట్టాలి. 5. చేతికి గ్లౌజులు ధరించడం, కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది. నైలాన్, సింథటిక్ బట్టలు వేసుకోవద్దు. 6. కంట్లో నిప్పురవ్వ లేదా మసి పడితే చల్లటి శుభ్రమైన నీటితో నెమ్మదిగా కడుక్కోవాలి. 7. కంటికి కట్టు కట్టవద్దు, ఇంట్లో మందులు వాడకూడదు. 8. వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా కంటి వైద్యుడిని సంప్రదించాలి. 9. క్రాకర్స్ ను బహిరంగ ప్రదేశంలోనే కాల్చాలి. ఇంట్లో లేదా గదిలో కాల్చవద్దు. 10. దగ్గరలో నీళ్ల బకెట్, ఇసుక సిద్ధంగా ఉంచుకోవాలి.
11. ఉబ్బసం, గుండె జబ్బులు ఉన్నవారు పొగకు దూరంగా ఉండాలి. 12. జంతువులకు దూరంగా క్రాకర్స్ కాల్చాలి. దీపావళిని సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని, పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ ను వాడాలని డా. లలితా దేవి జిల్లా ప్రజలను కోరారు.











