డయాబెటిస్ రోగులలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (పీఏడీ) పై అవగాహన అత్యవసరమని, సకాలంలో చికిత్స తీసుకోకపోతే కాళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు తెలిపారు.
మంచిర్యాలలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ, డయాబెటిస్ ఉన్నవారిలో పీఏడీ సమస్య వేగంగా పెరుగుతోందని, దీనివల్ల చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందని వివరించారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చని ఆయన హెచ్చరించారు.
నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు, వేళ్లు నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్ష, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు సమస్యను ముందే గుర్తించడంలో సహాయపడతాయన్నారు.
డయాబెటిస్ రోగులు రక్త చక్కెరను నియంత్రించుకోవడం, పొగతాగడం మానేయడం, అవసరమైతే మందులు లేదా యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు తీసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ శ్రీకాంత్ రాజు పేర్కొన్నారు. ప్రతి రోజు పాదాలను పరిశీలించడం, గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.
ముందస్తు అవగాహన, సకాలంలో చికిత్సతో కాలు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని డాక్టర్ శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ నవీస్ కుమార్ పాలకుర్తి కూడా పాల్గొన్నారు.










