జిల్లాలో మాతా శిశు మరణాల నివారణకు, సురక్షిత మాతృత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ పిలుపునిచ్చారు. "సురక్షిత మాతృత్వం" అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ మేయర్ శ్రీ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ శ్రీమతి సల్ల రమ్య మహేష్ లతో కలిసి కలెక్టర్ అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
"సాధారణ ప్రసవాలు ముద్దు - సిజేరియన్లు వద్దు" అనే నినాదంతో ప్రజల్లో మార్పు తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో ఇప్పటివరకు జరిగిన 4,485 ప్రసవాలలో 1,870 సాధారణ ప్రసవాలు జరగడం అభినందనీయమని, ప్రైవేటు ఆసుపత్రులు కూడా లాభాపేక్ష పక్కన పెట్టి సాధారణ ప్రసవాలు పెంచేలా గర్భిణీలకు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు.
గర్భిణీలలో అధిక ప్రమాదం ఉన్న (High Risk) కేసులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) స్థాయిలోనే గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. రక్తహీనత, అధిక/తక్కువ బరువు, మూర్ఛ, గుండె సమస్యలు, సికిల్ సెల్ ఎనీమియా, చిన్న వయసులో గర్భం దాల్చడం వంటి లక్షణాలున్న వారిని ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. ఆశా కార్యకర్తలు, వైద్యులు సమన్వయంతో పనిచేసి అటువంటి గర్భిణీలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 8,400 మందికి స్కానింగ్, 450 మందికి టీపా (TIFFA) స్కాన్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 108, 102 అంబులెన్స్ సేవలను గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రసవానంతరం ఆరు వారాల విశ్రాంతి, శిశువుకు తల్లిపాలు పట్టించడం, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 'కృషి ఎన్జీవో' సహకారంతో గర్భిణీలకు పండ్లు పంపిణీ చేశారు. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణీలకు వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.








