మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 13
మంచిర్యాల జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ఆదేశాల మేరకు ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు గల 1.80 లక్షల మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పోషకాహార లోపాన్ని, రక్తహీనతను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
మంచిర్యాల జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలు, సాయి కుంటల్లోని పిల్లలకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేయించారు. ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తో కలిసి నులిపురుగుల నుంచి రక్షణ కోసం పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను తినిపించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు గల 1,80,000 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను అందించనున్నారు. సుమారు 910 అంగన్వాడీ కేంద్రాలు, 749 ప్రభుత్వ పాఠశాలలు, 21 జూనియర్ కళాశాలలు, 180 ప్రైవేటు పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. 650 మంది ఆశా కార్యకర్తలు, 853 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రలు వేయడం జరుగుతుంది. ఒకటి నుండి రెండు సంవత్సరాల పిల్లలకు సగం టాబ్లెట్, రెండు నుండి మూడు సంవత్సరాల పిల్లలకు ఒక టాబ్లెట్ ను నలిపి, చప్పరించి తినిపించాలి. నులిపురుగులు ఉన్న పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనతతో అలసిపోయి, శారీరక, మానసిక ఎదుగుదలలో వెనుకబడి ఉంటారు. దీనిని నివారించడానికి సంవత్సరానికి రెండుసార్లు, ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి. దీనివల్ల పిల్లల్లో చురుకుదనం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
ఆల్బెండజోల్ మాత్రలు పిల్లలకు, పెద్దలకు సురక్షితమైనవి. ఇంటి వద్ద ఎలాంటి మాత్రలు ఇవ్వరాదు. ఈ మాత్రలను పాఠశాల లేదా అంగన్వాడి కేంద్రాల్లో మాత్రమే తీసుకోవాలి. మాత్రను బాగా నమిలి, శుభ్రమైన త్రాగునీటితో తీసుకోవాలి. మాత్రను సరిగా నమలకపోతే ప్రభావం చూపదు. మాత్ర వేసిన తర్వాత కొందరికి వికారం, స్వల్ప కడుపునొప్పి రావచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, చదువుపై ఏకాగ్రత పెంచాలని జిల్లా కలెక్టర్ పిల్లలకు సూచించారు.
ప్రభుత్వం పౌష్టికాహారం, వైద్య సేవలను అందిస్తున్నట్లు, పిల్లలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, ఏటీడబ్ల్యూ సురేష్, వైద్యులు డాక్టర్ అమన్, జిల్లా మాస్ మీడియా బృందం, బుక్ వెంకటేశ్వర, ఎండి రషీద్, అల్లాడి శ్రీనివాస్, సీహెచ్ఓలు నాందేవ్, పుట్ట సత్తయ్య, శ్రీనివాస్, కాకిరాల వెంకటేశ్వర్లు, డీపీహెచ్ఎన్ఆర్ఎస్ పద్మ, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ సబియా, వారి బృందం, వార్డెన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అందరూ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని, మిగిలిపోయిన పిల్లలకు 20వ తేదీన తిరిగి మాత్రలు వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ఉప కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో విద్య, వైద్య, ఐసీడీఎస్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.


