సింగరేణి కాలరీస్ లోని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఇటీవల మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మహిళా రోగి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి డివైసిఎంఓ(అడ్మిన్) డాక్టర్ ఎం.మధు కుమార్ శుక్రవారం తెలిపారు.
ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో తార అనే మహిళ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం మెరుగుపడి, ప్రస్తుతం నడవగలుగుతున్నారని, ఆరోగ్యవంతమైన స్థితిలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ మధు కుమార్ పేర్కొన్నారు.
ఈ సంక్లిష్టమైన శస్త్రచికిత్సను డా.విక్రమ్, డా.నరేష్ ల పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు. ఆర్థోపెడిక్ విభాగం, అనస్థీషియా బృందం, నర్సింగ్ సిబ్బంది, ఫిజియోథెరపీ బృందం, మరియు ఇతర వైద్య సిబ్బంది సమన్వయంతో కూడిన కృషి ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.
వైద్య సిబ్బంది నిబద్ధత, నైపుణ్యానికి ఈ శస్త్రచికిత్స నిదర్శనంగా నిలిచిందని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వారి అంకితభావానికి ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది. అత్యాధునిక వైద్య సేవలను అందించడంలో సింగరేణి యాజమాన్యం నిబద్ధతతో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ కిరణ్ రాజు, ఏరియా జనరల్ మేనేజర్ ఎం.రాధాకృష్ణలకు ఈ ఆపరేషన్ కు సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా ఆధునిక పరికరాలతో ఇక్కడ ఆపరేషన్లు జరుగుతున్నాయని, కార్మికులు, వారి కుటుంబాలు సింగరేణి ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.











