ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి ప్రమాదానికి గురైన మంచిర్యాల విద్యార్థిని లగిశెట్టి స్పందనకు అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) చేయూతనిస్తోంది. ఆమె వైద్య ఖర్చుల కోసం భారీ మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరించాలని నిర్ణయించింది.
మంచిర్యాల జిల్లా నస్పూర్ నాగార్జున కాలనీకి చెందిన లగిశెట్టి స్పందన, ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. మే 31న ఆమె ఒక ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అమెరికాలోని తెలుగు సంఘాలు స్పందించాయి.
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు చల్లా జయంత్, ఆటా చికాగో సేవక్ ఇన్చార్జి మహిపాల్, బుధవారం ఉదయం స్పందన చికిత్స పొందుతున్న పార్క్ రిస్ట్లోని అడ్వొకేట్ లూథరన్ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె వైద్య ఖర్చులైన సుమారు 4 లక్షల అమెరికన్ డాలర్లను (సుమారు రూ. 3.81 కోట్లు) ఆటా విరాళాల ద్వారా సేకరించి అందిస్తామని హామీ ఇచ్చారు.
స్థానిక కాంగ్రెస్ నాయకుడు రాచకొండ వెంకటేశ్వర్రావు, కార్పొరేటర్ రాచకొండ గోపాల్‌రావు, ఆర్&బీ విశ్రాంత ఎస్ఈ వేణు మాధవరావులు స్పందన తల్లిదండ్రులను కలిసి, వారి పరిస్థితిని ఆటా అధ్యక్షుడు జయంత్‌కు ఫోన్ ద్వారా వివరించారు. ఆయన అక్కడి తెలుగు సంఘాల సభ్యులతో మాట్లాడి, నిధుల సేకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం 'ఫండ్ మీ' అనే ఆన్లైన్ వేదిక ద్వారా స్పందన కోసం విరాళాల సేకరణ జరుగుతోంది. బుధవారం నాటికి 2,67,832 యూఎస్ డాలర్లు (సుమారు రూ. 2.55 కోట్లు) సేకరించబడ్డాయి. స్పందన తల్లిదండ్రులు అమెరికా వెళ్లేందుకు వీసా ప్రక్రియలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని వారు కోరుతున్నారు.












